ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెదేపా కైవశం చేసుకుంది. పట్టణంలో 20 వార్డులుండగా 8వ వార్డు ఏకగ్రీవమై పోలింగ్‌కు ముందే వైకాపా ఖాతాలో చేరింది. 19 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 13 వార్డులను తెదేపా గెలుచుకొని ఛైర్మన్ పీఠానికి స్పష్టమైన మెజార్టీ సాధించింది. తెదేపా 3, 4, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వార్డుల్లో గెలవగా, మిగిలిన ఆరు స్థానాలను వైకాపా గెలుచుకుంది. ఒత్తిళ్లు, కేసులు, బెదిరింపులు, నిర్బంధాలకు వెరవకుండా తమ అభ్యర్థులు బరిలో నిలిచారని, ప్రజలు ఆదరించి అఖండ విజయాన్ని అందించారని తెదేపా నాయకత్వం చెబుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పమిడి రమేష్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అభ్యర్థులకు అండగా నిలిచారు. జిల్లా ఎమ్మెల్యేలు రవికుమార్, సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ దర్శిలోనే ఉంటూ మార్గదర్శనం చేశారు. మరోపక్క, వైకాపా తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రచారంలో పాల్గొన్నారు. అయినా ఫలితం ప్రతికూలంగా వచ్చింది. స్థానికంగా ఎలాంటి పనులూ చేయకపోవడం, ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారినట్లు చెబుతున్నారు.
ప్రజలు ముందుచూపుతో వేసిన ఓటు