Cyclone Michaung Affects on AP : ప్రకాశం జిల్లాలో మిగ్‌జాం తుపాను ముప్పు ముంచుకొస్తుంది. సోమవారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. రోజంతా చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. జన జీవనం స్తంభించింది. విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో రహదారులు చాలా వరకు బోసిపోయి కనిపించాయి. తుపాను ప్రభావంతో కొత్తపట్నం, సింగరాయ కొండ మండలం పాకల తీరం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుడటంతో తీర ప్రాంతం అక్కడక్కడ కోతకు గురైంది. జిల్లా అంతటా చలిగాలుల తీవ్రత పెరిగింది. సముద్రం ఇరవై మీటర్లకు పైగా ముందుకొచ్చింది. మత్స్యకారులు పడవలు, వలలను సమీపంలోని ప్రధాన రహదారులు, సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. తీరం వైపు ఎవరూ వెళ్లకుండా మెరైన్, సివిల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి
Cyclone Michaung Affected in Prakasam District :మిగ్‌జాం తుపాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా సరాసరిన 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గాలులు కారణంగా చలి తీవ్రత పెరిగి వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు కారణంగా లోతట్టులో ఉన్న పొగాకు చేలల్లోనీళ్లు నిలిచిపోయాయి. ఇదే వర్షం కొనసాగితే పొగాకు పంటకు తీవ్ర నష్టంవాటిల్లు తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలులు కారణంగా రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అర్థరాత్రి తరువాత ఒంగోలులో కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పునరుద్దరించినప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో సరఫరా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చీమకుర్తి, దర్శి, టంగుటూరు తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా లేక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒంగోలు కార్పొరేషన్లో, కొత్తపట్నం, సింగరాయ కొండ ప్రాంతాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సహాయక చర్యలకు సిద్ధం: సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లాకు 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులను కేటాయించారు. తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో గంటకు 100 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్కు సమాచారం అందడంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు