Cyclone Effect in Kosta: మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన దంచికొడుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సరాసరిన 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు ఉప్పొంగాయి. కనిగిరి బస్టాండ్‌లోని ఆర్టీసీ(RTC) కార్గో కార్యాలయం వద్ద చెట్లు పడి బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆర్ అండ్ బీ బంగ్లా వద్ద పెద్ద వృక్షం ఓ ఇంటిపై పడింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పలు కాలనీల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షాల వల్ల పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. పొగాకు చేలల్లో నీళ్లు నిలిచిపోవడంతో పూర్తిగా నష్టపోయమంటూ రైతులు లబోదిబోమంటున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని పర్యటన - రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్
Michaung Effect on Guntur: మిగ్‌జాం తుపాను ఉమ్మడి గుంటూరు జిల్లాను ముంచేసింది. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిజాంపట్నం మండలంలో భారీ వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలో వర్షం దంచికొడుతుంది. భారీ ఈదురు గాలులకు పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. వర్షాల ధాటికి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మిర్చి, పత్తి, వరి, శనగ, పొగాకు తదితర పంటలతో పాటు అరటి, బొప్పాయి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో వానలు రావడంతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు.
"పొలాల్లో ఆరబెట్టిన ధాన్యమంతా తడిసిపోయింది. నందిగామ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాలతో తీవ్రంగా నష్టపోయాము. ప్రభుత్వమే ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము". -రైతు
Michaung Effect on Krishna: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఉమ్మడి కృష్ణా జిల్లాను ముంచెత్తాయి. మచిలీపట్నం మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మచిలీపట్నం సమీపంలోని శారదానగర్‌లో ఓ ఇంటి గోడ కూలింది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహాదారులన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడలోని భానునగర్‌లో బిల్డింగ్ ప్లాస్టింగ్ కోసం కట్టిన పరంజా(scaffolding) ఐదంతస్థుల పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో ఒక గృహం పూర్తిగా, నాలుగు ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తుపాను దివిసీమపై తీవ్ర ప్రభావం చూపింది. నాగాయలంలో లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి.
రైతులను కష్టాల కొలిమిలోకి నెట్టిన మిగ్‌జాం - ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం
Crops Damaged Effect of Michaung: తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పొలాలన్నీ జలమయమయ్యాయి. నందిగామ మండలంలో రైతులు పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు టెంటు వేశారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో కోతలకు సిద్ధంగా ఉన్న పైరంతా నేలవాలింది.
రైతులకు కన్నీటిని మిగిల్చిన తుపాను - పంట మెులకలు వచ్చే అవకాశం