కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పుడు ఏం చేయాలన్నా.. ఆంక్షలే. అంతిమయాత్ర లేదు... ఆఖరి చూపు చూసేవారు లేరు. ఏ మరణం సంభవించినా.. అది కరోనా గాటినే పడుతోంది. ఓ వ్యక్తి మరణిస్తే, ఆత్మ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చివరి చూపుగా వచ్చి నివాళులర్పించి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించే వారు.. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు.. కరోనా కారణంగా మరణించినవారి పరిస్థితి, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. సమాజంలో నెలకొన్న అనుమానాలు ఓ కారణమైతే, అధికారులు నిర్వాకం కూడా మరో కారణం.
ఉదాహరణకు ప్రకాశం జిల్లానే తీసుకుంటే అర్థమవుతుంది. ఒంగోలు జీజీహెచ్‌లో అధికారుల లెక్కల ప్రకారం మృతి చెందిన వారి సంఖ్య.. 49. ఇప్పటి వరకూ... 33 మందికి మాత్రమే అంత్యక్రియలు జరగ్గా... ఇంకా 16 మంది మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతదేహాల అప్పగింతలోనూ... అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఊళ్లలో గ్రామస్థుల అనుమానాల కారణంగా కనీసం అంత్యక్రియలకు నోచుకోని శవాలు ఆ మార్చురీలోనే ఉన్నాయి.
ఒంగోలు కమ్మపాలానికి చెందిన ఓ వృద్ధుడు అనారోగ్య కారణాల వల్ల ఒంగోలు రిమ్స్‌లో చేరాడు. గుండెపోటుతో ఆసుపత్రిలోనే మరణించాడు. మరణానంతరం కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. ఇక ఆయన మృతదేహం మార్చురీకే పరిమితమైంది. ఐదు రోజుల తర్వాత.. కుటుంబ సభ్యులు సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మృతదేహాన్ని అప్పగించారు. ఇదే తీరుగా మరో వ్యక్తి విషయంలో సిబ్బంది ప్రవర్తించారు. ఆఖరికి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా...మృతదేహాన్ని అప్పగించారు.