" నీటి పంపకంలో అనాలోచిత నిర్ణయాలు సరికాదు" - bjp
గోదావరి, కృష్ణా జలాల పంపకంలో దుందుడుకు తనం సరికాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శాసనసభ సమావేశాల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని.. అయినప్పటికీ వైకాపా, తెదేపా ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రానికి భాజపా అన్యాయం చేస్తున్నా.. అది తప్పించుకుని తిరగడానికి రాష్ట్రంలోని పార్టీలు అవకాశాన్ని ఇస్తున్నాయని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. కీలక బడ్జెట్ సమావేశాలు వైకాపా, తెదేపా దూషణలకే పరిమితమవుతున్నాయని ఆయన విమర్శించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో 'జమిలి ఎన్నికలు- ప్రజాసౌమ్యంపై దాని ప్రభావం' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కృష్ణ, గోదావరి నదీజలాల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దుందుడుకు వైఖరి సరికాదని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, కేంద్రం చర్యలు వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని తెలిపారు. ఇసుక రీచ్ల విషయంలో మెరుగైన విధానమని చెబుతూ...ప్రజలను, భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పోలవరం విషయంలో కేంద్ర నుంచి ప్రతి రూపాయి వచ్చేలా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు.