రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఓ వివాహానికి హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిందని.. ఇదే సమయంలో ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందన్నారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదలవుతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం విషయంలో ఏ న్యాయస్థానమూ జోక్యం చేసుకునే అవకాశం ఉండదన్నారు.