ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు జీజీహెచ్ లో పేరుకుపోతున్న బయో వ్యర్థాలు - prakasam dist news

కరోనా వైరస్ ఎప్పుడు, ఎలా సోకుతుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. మనిషి మనిషికీ భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తుంది. కరోనా బాధితులు వినియోగించే పీపీఈ కిట్లు, మాస్కులు, ఇంజెక్షన్ సిరంజీలు, ఇతర వ్యర్థాలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒంగోలు జీజీహెచ్ ఆవరణలో నిత్యం జనసంచారం ఉండే చోట బయో వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పారబోస్తున్నారు. ఈ వ్యర్థాలను చూసి ఆసుపత్రి వస్తున్న రోగుల బంధువులు వ్యాధులు సోకుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలు జీజీహెచ్ లో పేరుకుపోతున్న బయో వ్యర్థాలు
ఒంగోలు జీజీహెచ్ లో పేరుకుపోతున్న బయో వ్యర్థాలు

By

Published : Aug 17, 2020, 11:12 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వినియోగించే సిమెంట్ కట్లు, కాటన్, సూదులు, బ్లేడ్లు వంటి బయో వ్యర్థాలను జనావాసాలకు దూరంగా తరలించి ధ్వంసం చేస్తారు. ముంబయికి చెందిన ఓ గుత్తేదారుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రిలో బయో వ్యర్థాలను సేకరించి ఒక దగ్గర చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యర్థాలను వాహనాల్లో వేరేచోటకి తరలించి వాటిని ధ్వంసం చేస్తారు. ఒంగోలు జీజీహెచ్ లో బయో వ్యర్థాలను సేకరించేందుకు ముంబయి గుత్తేదారుడు ఒంగోలులో ఉన్న మరో సబ్ కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగించాడు.

పడకలు పెరిగాయి.. వ్యర్థాలు ఎక్కువయ్యాయి

కరోనా ముందు వరకు అంతా సవ్యంగానే జరిగేది. కొవిడ్​తో ఆసుపత్రుల్లో వ్యర్థాలు పెరుగుతున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో జీజీహెచ్ పడకల సంఖ్యను 500 నుంచి 1200లకు పెంచారు. దీంతో బయో వ్యర్థాలు పెరిగాయి. పీపీఈ కిట్లు, మాస్కులు వంటివే కాకుండా కరోనా రోగులకు అందిస్తున్న భోజన వ్యర్థాలు కూడా వీటిల్లో చేరుతున్నాయి.

పారిశుద్ధ్య కార్మికులు ససేమిరా

రోజూ టన్నుల కొద్దీ వ్యర్థాలు రావడంతో గుత్తేదారుడు ఏర్పాటు చేసుకున్న కార్మికులు సరిపోవడం లేదు. గుత్తేదారు తాను బయో వ్యర్థాలకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని, భోజన వ్యర్థాలకు కాదని వారిస్తున్నారు. భోజన వ్యర్థాల వల్ల పర్యావరణ నియంత్రణ అధికారుల నుంచి కూడా అభ్యంతరాలు వస్తాయని పేర్కొంటున్నారు. వ్యర్థాల సేకరణ, తరలింపునకు కార్మికుల సంఖ్య చాలక పోవడంతో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వినియోగించుకోవాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు తీసుకువచ్చారు. దీనికి మున్సిపల్ కార్మికులు అంగీకరించడం లేదు.

ఆసుపత్రి ఆవరణలో గుట్టలుగా బయో వ్యర్థాలు

కొవిడ్ వార్డుల్లోకి వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోలేమని, పైగా పట్టణంలో పారిశుద్ధ్య పనులే శక్తికి మించి చేస్తున్నామని మున్సిపల్ కార్మికులు అంటున్నారు. ఈ కారణాలన్నింటితో జీజీహెచ్ లో బయో వ్యర్థాలు రోజురోజుకీ పోగవుతున్నాయి. ఆసుపత్రి ఆవరణలోనే గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది హడలిపోతున్నారు.

ఇదీ చదవండి :ప్రసవం కోసం... కర్రల సాయంతో వాగు దాటించారు!

ABOUT THE AUTHOR

...view details