రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నందున ప్రకాశం జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు బస్, రైల్వేస్టేషన్లలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చినవారిలో కేసులు అధికంగా నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు ప్రాంతాల్లోని బస్, రైల్వేస్టేషన్లలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. సోమవారం ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్దారణ అయింది. అతను హైదరాబాద్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.