రాష్ట్రంలో కరోనా రెండోదశ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. తొలిదశ కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. గతేడాది ఆగస్టు 26న 61 వేల 838 నమూనాలను పరీక్షించగా 10 వేల 830 కేసులు వస్తే.. ఇప్పుడు 41 వేల 871 నమూనాల్లోనే 10 వేల 759 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే గతేడాది 10 వేలు దాటినప్పుడు 17 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు ఏంకగా 25.69 శాతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
మరో ఉద్యోగి మృతి..
రాష్ట్ర సచివాలయంలో మరో ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. కార్మికశాఖ సెక్షన్ అధికారి శరత్ చంద్ర అజయ్ కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. భయాందోళన చెందుతున్న ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. చాలామంది భయపడి విధులకు రాకపోవటంతో హాజరుశాతం కనీసం 30శాతం కూడా దాటడం లేదు. సచివాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు పాజిటివ్ రావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మాస్కులు తప్పనిసరి...
కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా కృష్ణా జిల్లావ్యాప్తంగా 26 ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రుల్లో సేవల పర్యవేక్షణకు ప్రత్యేకంగా వైద్యులను నియమించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు, బస్సుల్లో ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీఠాకూర్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్లను ఎప్పటికప్పుడు హైడ్రో క్లోరిక్ ద్రావణంతో శానిటైజ్ చేయాలన్నారు. తెనాలిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేలా ఆంక్షలు విధించారు. పంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలు, మందిరాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కొవిడ్‌తో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి చెందారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.