ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకూ కరోనాతో 567 మంది మరణించగా మిగిలినవారు అస్పత్రులు, హోంఐసోలేషన్లో వైద్యం పొందుతున్నారు. రోజువారీ కేసుల తీవ్రత 70 నుంచి 80 శాతం వరకు తగ్గింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కరోనా ఇంకా కలవర పెడుతోంది. కొలువు ఉన్నవారిలో ఇతర అనారోగ్య సమస్యలతో అందోళనకు గురిచేస్తోంది. కరోనా అనంతరం ఇతర రుగ్మతలతో చాలామంది ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. తెలిసిన వైద్యుల వద్దకు వెళ్లి కరోనా చేసిన గాయాలను ఏకరువు పెడుతున్నారు.
ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మరికొన్ని నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం హెచ్చరికలు చేస్తున్నా.. కొందరు నిర్లక్ష్యం వీడటంలేదు. గుంపులుగా మాస్కు లేకుండా తిరగడం మారుమూల ప్రాంతాలలోనే కాదు.. జిల్లా కేంద్రంలోనే సర్వసాధారణం అయింది. మాస్కు తప్పనిసరి అన్న నిబంధనలు పాటించకపోయినా పట్టించుకునే నాధుడు లేడు.
చుట్టుముట్టిన రుగ్మతలు..
జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ ప్రభావంతో కుటుంబాలకు కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. కరోనాను జయించామని చాలా మంది సంబరపడ్డారు. అలాంటి అధికారులకు, నాయకులకు పూలతో ఘనస్వాగతం పలికి అభినందించారు. కరోనా టీకా లేపోవడం, వెద్యంలో భాగంగా కొందరికి స్టెరాయిడు, ఇతర బూస్టర్ మందులతో చాలామందిని వైద్యులు రక్షించారు.
అలా కోలుకున్న వారిలో చాలా మందిని ఇతర అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. ఊపిరితిత్తులు బిగుసుకుపోయినట్లు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, జలుబు ఉన్నట్లు మాటతీరులో మార్పులు, ఆయాసం, నీరసం, ఒళ్ళు నొప్పులు, తరచూ దగ్గు, మధుమేహం బారిన పడటం లాంటి జబ్బులతో కొందరు అస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే కోలుకున్న వారిలో రుగ్మతలు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. 20 నుంచి 40 ఏళ్ల వయసు వారు కోలుకున్న తర్వాత 7 రోజులోనే సాధారణ స్థితికి చేరుకుంటున్నారని.. అలానే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాజిటివ్ బారిన పడిన చిన్నారులు సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు.