ప్రకాశం జిల్లాలో రైతులు సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచే కోతలు ప్రారంభం అయినా.. ప్రకాశం జిల్లాలో మార్చి నుంచి మొదలవుతాయి. జనవరిలో కురిసిన వర్షాలకు కొంతమేరకు పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా చేతికొస్తుందనకున్న పంట తెగుళ్ళ బారిన పడింది. పురుగుమందులు కొట్టి పంటను కాపాడుకుని ఎంతో కొంత మిగుల్చుకుందామనుకున్న రైతులు మార్చి నెల నుంచి కోతలకు సిద్ధమయ్యారు. ఆలోపు కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలుకావడం.. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూలీలు పనులకు వచ్చే వారు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి.
40 శాతం పంట నష్టం
కనీసం ఐదారు కోతలు కాసే మిరప ఒకటి రెండు కోతలు కూడా పూర్తిచేయని రైతులు లబోదిబోమంటున్నారు. కూలీలు వచ్చే అవకాశం లేక పండిన పంటంతా చేలలోనే ఎండిపోయి నేల రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 శాతం పంట దెబ్బతింటోందని మొరపెట్టుకుంటున్నారు.