ఒంగోలు కలెక్టరేట్‌లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంగోలు నగరం కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతానికి చెందిన మారుబోయిన వీరాంజనేయులు(53) ఇరవై సంవత్సరాల క్రితం పోలీసు శాఖలో చేరారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఆయన కొన్నేళ్లుగా సీసీఎస్‌లో పని చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నందున ఆయనకు కలెక్టరేట్‌లోని కొవిడ్ సెల్‌లో ఇటీవల విధులు కేటాయించారు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి వస్తూ తన వెంట చీర తెచ్చుకున్నారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో సిబ్బందికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న గాలిపంకాకు చీరతో ఉరి వేసుకుని మృతి చెందారు. కొవిడ్ సెల్ నుంచి బయటికి వెళ్లిన వీరాంజనేయులు ఎంతసేపటికీ తిరిగి రాకుండటంతో సహచరులు గదిలోకి వెళ్లి చూశారు. ఉరికి వేలాడుతుండడాన్ని గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి అప్పటికే అతను మృతి చెందినట్టు గుర్తించారు. వీరాంజనేయులు సుమారు పదిహేను సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. నిత్యం ఆందోళనకు గురయ్యేవారు. రెండేళ్ల క్రితం ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందారు. ఈ ఉదంతం ఆయన్ను మరింత కుంగదీసింది. ఇటీవల నాలుగు రోజులుగా జ్వరం వస్తుండటంతో.. తనకూ కరోనా సోకిందేమోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన తిరిగి విధులకు రాలేదు... - ఒంగోలు కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య వార్తలు
కరోనా సోకిందేమోనని భయంతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగింది. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య