Conflicts in YSRCP: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు విస్తృతమయ్యాయి. అలాగే ఒకరిపై ఒకరి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. విశాఖ, ఒంగోలు, నెల్లూరు ఇలా ఏదో ఒకచోట నాయకుల మధ్య లొల్లి నడుస్తూనే ఉన్నాయి. నువ్వంటే నువ్వంటూ అంతర్గతంగా దూషించుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కొండపిలో అధికార వైసీపీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి.
వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబు తనను రాజకీయంగా అవమానిస్తున్నారని, గిరిజనులను చిన్న చూపు చుస్తున్నారని.. గొడవలు, హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారని.. అదే పార్టీకి చెందిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావూరి ప్రభావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తూ, తొలి నుంచి పార్టీలో కష్టపడిన వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రావూరి ప్రభావతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబు తమ గ్రామానికి వచ్చినప్పుడు.. గ్రామ సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని, అప్పటినుంచి తన మీద కక్ష కట్టారని ఆమె పేర్కొంది. గిరిజనులకు రాజకీయాలు ఎందుకు అని అశోక్ బాబు అనుయుడు, సోమరాజుపల్లి సర్పంచ్ యన్నబత్తిన సరోజ కుమారుడు కార్తిక్ తనపై ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శించారని ప్రభవాతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా దుర్భషలాడుతు.. అసభ్య పదజాలంతో దూషించి తనపై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా పలువురు అడ్డుకొని తనను రక్షించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.