మంత్రి ఎదుటే కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో శనివారం జరిగిన సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ, వాలంటీర్ల సన్మానంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అది ముగిశాక మంత్రి తన కారు వద్దకు వెళ్తుండగా, ఆయన ఎదుటే రామాయపాలెం, రేగుమానుపల్లి, పోతంపల్లి, బి.చెర్లోపల్లి గ్రామాల్లోని వైకాపాకు చెందిన ఇరువర్గాల నాయకులు, స్థానిక సమస్యలను మంత్రికి వివరిస్తూ వాదులాటకు దిగారు.
వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. మంత్రి ఎదుటే వాదులాట
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో వైకాపాలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి ఆదిమూలపు సురేశ్ సమక్షంలోనే వైకాపా శ్రేణుల ఘర్షణ దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైకాపా శ్రేణులకు సర్దిచెప్పి మంత్రి ఆదిమూలపు సురేశ్ వెళ్లిపోయారు.
ఉపాధి పనుల్లో ఓ వర్గం వారికే హాజరు వేస్తున్నారని, మరో వర్గం వారికి అన్యాయం చేస్తున్నారని రామాయపాలేనికి చెందినవారు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో రేగుమానుపల్లి, పోతంపల్లి వాసుల మధ్య వాదులాట చోటుచేసుకుంది. గతంలో పోతంపల్లికి చెందిన వ్యక్తి డీలర్‌గా ఉన్నారని, ఇప్పుడు రేగుమానుపల్లికి మార్చాలంటూ గట్టిగా పట్టుబట్టారు. నీటి ట్యాంకర్లకు తమకే కేటాయించాలంటూ బద్వీడు చెర్లోపల్లికి చెందిన ఇరువర్గాల వారు భీష్మించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. అందరూ కలసికట్టుగా చేసుకోవాలంటూ చెప్పి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి:Video Viral: స్థల విషయంలో వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడి