రైతు ప్రకాశం పేరుతో రూపొందించనున్న వెబ్‌సైట్‌పై సంబంధిత అధికారులతో స్థానిక ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్షించారు. పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వైబ్‌సైట్‌లో పొందుపరచడంతోపాటు ఆడియో, వీడియో రూపంలోనూ సందేహాల నివృత్తి, సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి, బ్రాడ్ కాస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం నుంచి రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు సమాచారం చేరేలా చూడాలని కోరారు.
'సాగులో మెళకువలపై రైతులను చైతన్యవంతం చేయాలి' - ప్రకాశం జిల్లాలో కలెక్టర్ సమావేశం
సాగులో మెళకువలు, సస్య రక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ చైతన్యవంతులను చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ఈ మేరుకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సస్యరక్షణ కార్యక్రమాలను రూపొందించడానికి పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఓబీ వ్యాన్ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఆర్సీలో టోల్ ఫ్రీ నంబరు కేటాయించాలని సూచించారు. మండలాల వారీగా గోదాములు, వాటి నిల్వ సామర్థ్యం ఎంత, ఇంకా ఎంత నిల్వ చేసుకునే అవకాశం ఉందనే వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. దర్శిలోనూ శాటిలైట్ బ్రాడ్ కాస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. జేసీ వెంకట మురళి, జేడీఏ శ్రీరామమూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.