CMO: ఒంగోలులో నిన్న తిరుపతి వెళ్లే ప్రయాణికుడి కారు స్వాధీనం ఘటనపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందింది.
అసలేం జరిగిందంటే..:తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి సమయంలో ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు.