ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM JAGAN వెలిగొండను ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామన్న సీఎం జగన్​ - ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమంలో సరదా సన్నివేశం

2023 సెప్టెంబర్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు. ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్‌ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్‌ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు.

cm jagan cheemakurthi tour
cm jagan cheemakurthi tour

By

Published : Aug 24, 2022, 2:17 PM IST

Updated : Aug 25, 2022, 6:52 AM IST

CM JAGAN గ్రానైట్‌ పరిశ్రమకు మేలు జరిగేలా శ్లాబు విధానం తీసుకొచ్చామని, ఈ పరిశ్రమ విద్యుత్తు ఛార్జీల్లో యూనిట్‌కు రూ.2 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మహనీయులకు మరణం ఉండదని, వారు చేసిన మంచి కార్యక్రమాలు, సేవల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారన్నారు. ‘‘పాదయాత్ర సమయంలో చిన్న పారిశ్రామికవేత్తలు గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకొచ్చారు.

గ్రానైట్‌ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయన్న సీఎం జగన్​

ఈ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని నాడు మాట ఇచ్చా. ఆ ప్రకారమే జీవో నంబరు 58 తెచ్చి, మళ్లీ శ్లాబు విధానాన్ని తీసుకొస్తున్నాం. దీని ప్రకారం 22 క్యూబిక్‌ మీటర్ల వరకు ముడి రాయిని ప్రాసెస్‌ చేసే యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో సింగిల్‌ బ్లేడుకు రూ.27 వేలు, మల్టీబ్లేడుకు రూ.54 వేలు.. శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాల్లో సింగిల్‌ బ్లేడుకు రూ.22 వేలు, మల్టీబ్లేడుకు రూ.44 వేలు సీనరేజ్‌ శ్లాబుగా నిర్ణయించాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.135 కోట్ల నష్టం వస్తుంది. చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు ప్రస్తుతమున్న విద్యుత్తు హెచ్‌టీ రూ.6.30, ఎల్‌టీ రూ.6.70 ఉంది. ఈ ఛార్జీల్లో యూనిట్‌కు రూ.2 తగ్గిస్తున్నాం. దీనివల్ల రూ.210 కోట్లు ప్రభుత్వంపై భారం పడనుంది. అయినా పరిశ్రమ బాగు కోసం బుధవారం నుంచే ఈ రెండింటినీ అమల్లోకి తీసుకొస్తున్నాం’ అని వివరించారు.

2023 సెప్టెంబరుకు వెలిగొండను పూర్తి చేస్తాం
ప్రకాశం జిల్లా రైతులకు మేలు చేసేలా వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబరు నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని, దీన్ని ప్రారంభించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2014కు ముందే వెలిగొండ మొదటి సొరంగం పనులు 11.58 కిలోమీటర్లు, రెండో సొరంగం పనులు 8.74 కిలోమీటర్లు తవ్వారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మొదటిది 4.33 కి.మీ, రెండో సొరంగం పనులు 2.35 కి.మీ. మాత్రమే తవ్వారు. మేం వచ్చాక గత మూడేళ్లలో మొదటి సొరంగంలో 2.9 కి.మీ, దీని నుంచి రెండో సొరంగంలోకి మార్గం ఏర్పాటుచేసి 3.71 కి.మీ. తవ్వాం. ఇంకా తవ్వాల్సింది 3.96 కి.మీ. మాత్రమే ఉంది’ అని వివరించారు.

ఎన్నికల హామీలు 95% అమలు
పేదలు, రైతుల సంక్షేమం గురించి చెప్పినప్పుడు తెలుగు నేలపై వైఎస్‌ఆర్‌ పేరు గుర్తుకొస్తుందని సీఎం జగన్‌ అన్నారు. బట్టలు ఆరేసుకోవడానికే విద్యుత్తు తీగలు పనికొస్తాయని చెప్పిన ఆ రోజుల్లోనే ఏకంగా ఉచిత విద్యుత్తుపై రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకం చేశారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో రాజశేఖర్‌రెడ్డి ఒకడుగు వేస్తే ఆయన బిడ్డగా తాను నాలుగడుగులు ముందుకేసి 95% ఎన్నికల హామీలను అమలు చేసినట్లు వెల్లడించారు.

బూచేపల్లి సుబ్బారెడ్డి కూడా ఎన్నో మంచి పనులు చేశారని, వారిద్దరి విగ్రహాల ఆవిష్కరణకు రావడం సంతోషకరంగా ఉందన్నారు. విజయవాడలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని ప్రకటించారు. మహాత్మాగాంధీ, జ్యోతిరావుఫులే, జగ్జీవన్‌రాం, మౌలానా అజాద్‌, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు మరణం ఉండదని, వారి సేవలను కలకాలం తలచుకుంటూనే ఉంటామన్నారు.

జడ్పీ ఛైర్‌పర్సన్‌ నోట.. ‘రాజశేఖరన్న పాట’
సభలో ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌పై పాట పాడారు. ‘ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. మళ్లెప్పుడొస్తావు రాజశేఖరన్నా. ఏమైనావు రాజశేఖరన్నా.. మంచి మనసున్న రాజశేఖరన్నా...’ అంటూ ఆమె పాట అందుకున్నారు. కొద్దిసేపు పాడిన తర్వాత సీఎంతోపాటు ఆమె పక్కనే నిల్చున్న కుమారుడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఇక చాలని వారించారు. అయినా వెంకాయమ్మ కొనసాగించడంతో సీఎం తాను కూర్చున్న స్థానం నుంచి నవ్వుతూ లేచి వెళ్లి ఆమెను ఆత్మీయంగా తీసుకువెళ్లి తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు.

సీఎం సభలో సరదా సన్నివేశం

కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ నందిగం సురేష్‌, శాసనసభ్యులు సుధాకర్‌బాబు, అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్‌, కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తూమాటి మాధవరావు, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె.కనకారావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 6:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details