ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. రూ. 1,262 కోట్ల సున్నా వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లో వేశారు. గత 35 నెలల్లో రూ. లక్షా 36వేల కోట్లను వివిధ పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లోకి జమచేసి, వారి ఆర్థిక స్థితిగతులను మార్చేసామని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మోసాల వల్ల డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్ విమర్శించారు. సున్నావడ్డీ మాట అటుంచితే.. అధిక వడ్డీలు చెల్లించుకోవాల్సి వచ్చేదన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక.. 12 శాతం పైబడి ఉన్నవడ్డీ రేటును ఆరున్నర శాతానికి తగ్గించామన్నారు. అంతేకాక సకాలంలో తమ రుణాలు చెల్లించే స్థితికి చేరుకోవడంతో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో మొత్తం రూ. 3,616 కోట్ల వడ్డీరాయితీ జమచేశామని.. అనుకున్న సమయానికి వడ్డీ రాయితీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తామని అన్నారు. దీంతో కోటి రెండు లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
వైకాపా హయాంలో సంఘాలు పునర్జీవనం పోసుకున్నాయని.. ఆర్థిక పురిపుష్టిసాధించి, కళకళలాడుతున్నాయన్నారు. ఇది అక్కా చెల్లెళ్ల విజయగాధ.. ప్రభుత్వం విజయగాధ.. అని చెప్పారు. అయితే.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని కొందరు పథకాలను ఆపే కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సంక్షేమం అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని అంటున్నారని.. నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా ఎందుకు మారుతుందో చెప్పాలని అన్నారు. ఇలా కాకుండా.. ప్రజల సొమ్మును జేబుల్లో వేసుకుంటే అమెరికా అవుతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న జగన్.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్న రాక్షసులకు, దుర్మార్గులకు బుద్ధి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.