ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 'మనబడి నాడు-నేడు' కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతర్జాలమే కనిపిస్తోందనీ.. మరో పదేళ్లలో పరిస్థితి ఇంకా మారిపోతుందన్నారు. పదేళ్ల తర్వాత రోబోటిక్స్ కీలకమవుతాయనీ.. ఆంగ్ల చదువులు లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో చదువురాని పిల్లలు 33 శాతం ఉన్నారనీ.. పేదల తలరాత మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలను మార్చాలని స్పష్టం చేశారు. మన పిల్లల మంచి కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. సరైన సమయంలో సరైన విధానాలు తీసుకురావాలని ఉద్ఘాటించారు.
చరిత్రను మార్చే నాడు-నేడు
చరిత్రను మార్చే తొలి అడుగుగా 'నాడు-నేడు' ప్రారంభించామని సీఎం తెలిపారు. 45 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో మూడు దశలుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. మొదటి దశ కింద 15 వేల 715 పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తరగతి గదుల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయనీ.. అదనపు తరగతి గదులు, ఆంగ్ల ప్రయోగశాలలు వంటి 9 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.