CM Jagan False Promises on Veligonda Project: ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూపు.. వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ మాటలు నీటి మూటలేనా..? CM Jagan False Promises on Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్‌పై (Veligonda Project) ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రోజుకొక మాట.. పూటకొక హామీ ఇచ్చారు. సీఎం స్థానంలో ఉన్న వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.. మాట తప్పితే పదవి నుంచే దిగిపోవాలంటూ జగన్ నీతి సూత్రాలు వల్లె వేస్తుంటారు. ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి.. కరవు ప్రాంతానికి సాగునీరు అందిస్తానంటూ వరుసగా నాలుగేళ్లపాటు చెప్పినమాటే చెప్పడమేగాక.. దాన్నీ తప్పుతూనే ఉన్నారు. ఇదిగో పనులు పూర్తయ్యాయి.. అదిగో నీళ్లిస్తామంటూ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో ఇంకా చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
శ్రీశైలం వరద జలాలను ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు అందించేందుకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టును జగన్ సర్కార్ పూర్తి చేయలేకపోయింది. నిధులూ అంతంత మాత్రమే ఇచ్చింది. ఆయకట్టుకు నీళ్లిస్తామన్న మాటలు తప్ప చేతలు శూన్యమయ్యాయి. శ్రీశైలం జలాశయం కొల్లంవాగు నుంచి నల్లమల అడవుల్లో ఉన్న కొండలను సొరంగాలుగా తొలచి వాటి ద్వారా నీళ్లు తెచ్చి జలాశయంలో నింపేలా ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు.
TS Water Board Letter To Krishna Board : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఆపించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
ఆ జలాశయం నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించాలని ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 18.89 కిలోమీటర్ల పొడవునా రెండు సొరంగాలను తవ్వుతున్నారు. ఇందులో ఇంతవరకు ఒక సొరంగం నిర్మాణమే పూర్తయింది. రెండో సొరంగం నిర్మాణ పనులు ఎప్పటి నుంచో సాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ ప్రాంతాల్లో సహజసిద్ధమైన నల్లమల కొండల శ్రేణుల మధ్య ఖాళీలను పూరించి జలాశయంగా నిర్మించారు. రెండు సమాంతర సొరంగాల ద్వారా నీరు దోర్నాల మండలం కొత్తూరుకు వచ్చి చేరతాయి. అక్కడి నుంచి 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ నింపాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 43.5 TMCల కృష్ణా వరద జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు.
మూడు దశల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తికానుంది. తొలిదశలో వెలిగొండ టన్నెల్ ద్వారా నీళ్లు తీసుకువచ్చి నల్లమలసాగర్ జలాశయం నింపనున్నారు. అక్కడి నుంచి కాలువలకు నీళ్లు తరలించే హెడ్ రెగ్యులేటర్, చిన్న స్థాయి టన్నెల్ పనులు చేస్తున్నారు. జలాశయంలో నీళ్లు నిలబెట్టాలంటే ఆ పరిధిలో ఉన్న ఊళ్లను తరలించాలి. ఇందుకు పునరావాస ప్యాకేజీ కింద రూ.1400 కోట్లు చెల్లించాలి. తక్షణం రూ. 800 కోట్లు ఇస్తేగానీ జలాశయంలో నీళ్లు నిలబెట్టడం కుదరదు. అయితే ప్రస్తుతానికి నల్లమలసాగర్‌లో నీళ్లు నిలిపి మమ అనిపించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం ఇక్కడ నీరు నిలబెట్టినంత మాత్రాన ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు.
CM Jagan Silence on Polavaram Project: సీఎం జగన్ మౌనముద్ర.. పోలవరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయల నష్టం
రెండోదశలో 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా కాలువలు, ఇతర పనులతో పాటు మరో రెండు జలాశయాలు నిర్మించాల్సి ఉంది. దీనికోసం రూ. 800 కోట్లు అవసరం. కానీ ఈ పనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక మూడో దశ పనులకు రమారమీ రూ.3వేల కోట్లు అవసరం కానున్నాయి. ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు.
తెలుగుదేశం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్ట్‌పై రూ. 4,915 కోట్లు ఖర్చు చేయగా.. తర్వాత ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,054 కోట్లకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిధులూ సరిపోవని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో వెలిగొండపై చేసిన ఖర్చు కేవలం రూ.976 కోట్లు మాత్రమే. కానీ బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు ప్రతిపాదించారు. అంటే నాలుగో వంతు నిధులూ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఇవ్వలేదు.
Uttarandhra Sujala Sravanthi Project: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఇచ్చిన హామీ గుర్తుందా జగన్?