ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో కొంత కాలంగా ఆగిన గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలకు ఇప్పుడు స్థానికంగా కొందరు నాయకులు మళ్లీ తెరతీశారు. అభివృద్ధి పేరుతో లూటీ.. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో సహజ వనరులను లూటీ చేస్తున్నారు. కొంత మంది నాయకుల కనుసన్నల్లో అనధికారికంగా మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. మర్లపాడు, కందులూరు ప్రాంతాల్లో కొండ పోరంబోకు భూములను గుల్ల చేస్తున్నారు. నిత్యం రూ.లక్షల విలువ చేసే గ్రావెల్‌ను అడ్డదారుల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్, టిప్పర్ల ద్వారా అధికారుల కళ్ల ముందే తరలిపోతున్నా.. అక్రమాలను నిలువరించే పరిస్థితి లేదు. టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు, కందులూరు ప్రాంతాల్లో 500 ఎకరాలకుపైగా కొండ పోరంబోకు భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములు మట్టిమాఫియా చేతుల్లోకి వెళ్లాయి.
వాళ్లు దోస్తారు.. వీళ్లు చూస్తారు !
అధికారమే అండగా.. మట్టి దందా పెద్ద ఎత్తున జరుగుతోంది. పర్యవేక్షణ చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో మట్టి వ్యాపారుల అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. నిత్యం వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిపోతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
"కందులూరు, కొణిజేడు, మర్లపాడు కొండ పోరంబోకు భూముల్లో తనిఖీలు చేపడతాం. గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పనులకు గ్రావెల్‌ను తరలించాలన్నా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. రాత్రివేళ తవ్వకాలు చేయకుండా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెడతాం. అనధికారిక తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం" - జగన్నాథరావు, ఏడీ, మైనింగ్ శాఖ
నిబంధనలకు పాతర...
- వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదుల్లో ఇసుకతోపాటు ప్రభుత్వ భూముల్లో గ్రావెల్, మట్టి తవ్వకాలపై నిషేధం విధించారు. దీంతో గనుల శాఖ అనుమతులు ఉన్న ప్రాంతం నుంచి గ్రావెల్ తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించారు. ఆ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేయాలంటే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు పరిశీలించి గనుల శాఖకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ అభివృద్ధి పనులకు తప్పనిసరిగా అనుమతి పొందిన ప్రాంతాల నుంచి గ్రావెల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సీనరైట్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.
- ఇటీవల కాలంలో ఇళ్లస్థలాలు, రహదారులు, వ΄డో రైల్వే నిర్మాణ పనులు, పరిశ్రమల స్థలాలను చదును చేసేందుకు గ్రావెల్ అవసరాలు పెరిగాయి. దీన్ని అవకాశంగా తీసుకుని గ్రామస్థాయిలో ఉన్న కొందరు నాయకులు అధికార అండతో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు.
- ఒంగోలు, టంగుటూరు, కొండపి, జరుగుమల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాల కోసం కొండ పోరంబోకు భూములను తవ్వేస్తున్నారు.
- ట్రాక్టర్ మట్టి రూ. 500, ట్రిప్పర్ అయితే రూ. 3000 వరకు విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి: నిషేధిత గుట్కా స్వాధీనం... ఓ వ్యక్తి అరెస్ట్