Class War in YSRCP Leaders :వైఎస్సార్సీపీ కంచుకోటలు బద్దలవుతున్నాయి. ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యం తీసుకొచ్చిన ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ కోటలు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరులో స్వీప్ చేసిన వైఎస్సార్సీపీకి ఇప్పుడు అక్కడ అభ్యర్థులను ఖరారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీని వీడారు. ఉన్న వారిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని వైఎస్సార్సీపీ నేతలే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్తగా నియమించిన సమన్వయకర్తల్లో ఒకరు చివరి వరకూ ఉంటారా మధ్యలోనే ఝలక్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
YSRCP Leaders Fire in CM Jagan :నెల్లూరులో ఎంపీ ఆదాలను గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థి కరవయ్యారు. ఇంతకాలం పార్టీకి ఆర్థికంగా అండదండలందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి అయితే ఒప్పించారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు కూడా కానీ, ఇప్పుడు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు చోట్ల ప్రస్తుతమున్న సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని పట్టుబట్టారని సమాచారం. వారినే పోటీ చేయిస్తే తాను పోటీ చేయడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన అధినాయకత్వానికి పంపారని అంటున్నారు.
CM Jagan Changing Constituency in Charge :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఏడు స్థానాల్లో మార్పులు చేర్పులకు సీఎం జగన్ నిర్ణయించారు. సిటింగ్‌లకు ఆ విషయాన్ని ఇప్పటికే చెప్పేయడంతో వారు భగ్గుమంటున్నారు. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్‌ను ఈసారి మరోచోటికి మారుస్తున్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ZPTCలు, MPTCలు, పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు. జోగిని మారిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ సమావేశం, అందులో ఆ నేతల నిర్ణయం వెనుక మంత్రి జోగి మంత్రాంగం ఉందనే చర్చ జరుగుతోంది.
వైఎస్సార్సీపీ లీగల్ సెల్లో వర్గ విభేదాలు - కష్టకాలంలో పార్టీకి పని చేస్తే గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన
YSRCP Changing Constituency in Charge For Elections : మైలవరంలో సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఆ స్థానం ఆశించిన మంత్రి జోగి రమేష్ అక్కడ గత కొంతకాలం తెర వెనుక రాజకీయం చేశారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. పార్టీ అధిష్ఠానం, CMO జోగిని పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాయి. అప్పటికి సద్దుమణిగినా మైలవరంలో ఎమ్మెల్యేతో మంత్రికి వర్గపోరు పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు సమన్వయకర్తల మార్పుల నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలిచినా ఎమ్మెల్యే అందుబాటులోకి రావడం లేదని సమాచారం.
రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణకు మార్చారు. రామచంద్రపురం టికెట్ తనకు దక్కకపోవడానికి అక్కడున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, MLC తోట త్రిమూర్తులు కారణమని ఆగ్రహంతో ఉన్న మంత్రి వేణు తన కార్యకర్తలతో మాట్లాడారు. రామచంద్రపురంలో మళ్లీ అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరంతా అడ్డుకోండని కార్యకర్తలకు చెప్పారు. తోట, బోస్ వర్గాలు అరాచకాలు చేస్తున్నాయని చెప్పకనే చెప్పారు.
ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీలో వైవీ వర్సెస్ బాలినేని-మాగుంట : ప్రకాశం జిల్లా మాజీ MP వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గ్రూపులుగా చీలిపోయింది. అద్దంకి, కొండపి నియోజకవర్గాల సమన్వయకర్తలిద్దరినీ వైవీ మార్పించారని బాలినేని వర్గం గుర్రుగా ఉంది. జిల్లాలో ఆయన ఆధిపత్యం ఎక్కువవుతుండడంతోపాటు ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ సీటు ఆయన తనకు, తన కొడుకు కోసం అడుగుతున్నారనే అంశం పార్టీలో ఆజ్యాన్ని పోసింది. మరోవైపు తన సీటుకే ఎసరు పెడుతున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు బాలినేని మద్దతునిస్తున్నారు.