Officials are locking the park on Sundays: పార్కుకు ఆదివారం తాళాలు వేయడంతో చిన్నారులు ప్రహరీ గోడలు దూకి ఆటలాడుకోవలసిన పరిస్థితి నెలకొంది. చిన్నారులు గోడ దూకే విధానాన్ని చూస్తున్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోడలు దూకే సమయంలో వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంతో పాటుగా ఆసక్తిగా చూస్తూ ఉండిపోతున్న ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో చోటు చేసుకుంది.
అసలే ఆదివారం అందులోనూ ఆటలాడుకునే వయస్సున్న చిన్నారులు. అయితే ఆపిల్లలు ఆటలు ఆడుకోవాలంటే మాత్రం ఆ గోడ దూకక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలను ఆ పార్కు కేటాయించారు. అయినప్పటికీ ఆదివారం చిన్నారులు ఆడుకుందామనుకుంటే పార్కు గేట్లకు తాళం వేసి దర్శనమిస్తుంది. చిన్నారులు తమ ఇళ్ల వద్ద ఆటలాడుకునేందుకు ఆట స్థలం లేక పార్కు ప్రహరీ గోడ దూకి పార్కులోనికి వెళ్లి ఆటలాడుకోవలసిన దుస్థితి నెలకొంది. గతంలో క్రీడాకారుల, చిన్నారుల శారీరక దృఢత్వం పెంపొందించాలనే లక్ష్యంతో లక్షల రూపాయల ఖర్చు చేసి ప్రభుత్వం, స్థానిక మున్సిపల్ కార్యాలయానికి అందించగా అవి కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విరిగిపోయిన రిక్షాల మధ్యలో తుప్పుపట్టే పరిస్థితికి చేరుకున్న తరుణంలో ఈటీవీ భారత్, ఈనాడు పత్రికా న్యూస్ ఛానల్లో కథనాలను ప్రచురించింది.
దీంతో వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు ఆయా పరికరాలను స్థానిక మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన పులి వెంకట రెడ్డి పార్కులో చిన్నారుల, క్రీడాకారుల, స్థానిక ప్రజల అవసరాల కనుగుణంగా సర్వాంగ సుందరంగా వ్యాయామ, ఆట పరికరాలను అమర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ... సోమవారము నుంచి శనివారం వరకు మాత్రం పార్కును అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఆదివారం మాత్రం పార్కుకు తాళాలు వేసి దర్శనమిస్తుండడంతో చిన్నారులు, స్థానికులు నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు చిన్నారులు పాఠశాలకే పరిమితమౌతున్నారు. ఆదివారం రావడంతో పిల్లలంతా పార్కు వద్ద ఆటలాడుకునేందుకు ఆశగా వస్తుంటారు. పార్కు ప్రధాన గేట్లకు తాళాలు వేసి దర్శనమిస్తుండటంతో చిన్నారులు ఆటలాడుకునేందుకు వీలు లేక వెనుదిరిగి నిరాశగా వెళుతున్నారు.