ఇదిగో ఇదే చట్టు బావి.. పైనుంచి చూసి చిన్నదే కదా అని తీసి పారేయకండి. మనకు చిన్నదే కావచ్చు. కానీ ప్రకాశం జిల్లా కనిగిరి శివారు ప్రాంతాలకు.. ఇదే నీటి వనరు. ఇందులో నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో.
ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతాన్ని కాటమ రాజులు, ఉదయగిరి రాజులు ఏలారని చరిత్ర చెప్తోంది. కాటమ రాజుల కాలంలో కనిగిరిని దుర్గంగా పిలుస్తుండేవారు. ప్రజలకు, అప్పటి భటులకు దాహార్తిని తీర్చడానికి ఆనాటి పాలకులే దీన్ని తవ్వించారని స్థానికులు చెప్తున్నారు. రాజులు, రాజ్యాలు పోయినా నేటికీ ఈ బావి ప్రజల దాహార్తి తీరుస్తూనే ఉంది. సుమారు 30 అడుగుల లోపల బండరాళ్లను గోడలుగా పేర్చి దీన్ని నిర్మించారు. రాతి పొరల నుంచి ఊట ఈ బావిలోకి చేరేలా.. కొండ దిగువన బావిని నిర్మించారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంటుంది. కానీ ఈ బావిలో జలాలు స్వచ్ఛంగా ఉంటాయని, వడపోత అక్కర్లేకుండా తాగుతామని.. స్థానికులు చెప్తున్నారు.