ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్న పొరపాటుకు ఐదేళ్ల నరకం- స్వర్ణయుగం కోసం కదలి రావాలని చంద్రబాబు పిలుపు - Andhra pradesh

Chandrababu Raa Kadali ra Meeting: రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించారని, కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 'రా కదలిరా' పేరిట ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు పంచి వంద లాగేస్తుందని మండిపడ్డారు.

Chandrababu_Raa_Kadali_ra_Meeting
Chandrababu_Raa_Kadali_ra_Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 10:13 PM IST

Chandrababu Raa Kadali ra Meeting: జగన్‌ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలి రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి వేదికగా 'రా కదలిరా పేరిట తెలుగుదేశ-జనసేన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.

నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని పిలుపునిస్తే అది ప్రభంజనమైందని, ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదిలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో సాగాలంటే సైకో పోవాలి సైకిల్‌ రావాలని చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తామన్న తెలుగుదేశం అధినేత సంపదను ఎలా పెంచుకోవాలో ప్రజలకు నేర్పిస్తానన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను జగన్‌ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

నాలుగేళ్లలో బీసీలకు జగన్​ ఒక్క రూపాయీ ఇవ్వలేదు: చంద్రబాబు

రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే: రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టాంమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి సంకల్పం తీసుకోవాలని, రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేశారు. 'రా కదలి రా'కు పౌరుషాల గడ్డ ప్రకాశం గడ్డపై ప్రారంభించామన్న చంద్రబాబు, ఆంగ్లేయుల తుపాకులకు గుండె చూపించిన ప్రకాశం ఈ జిల్లా వారేనని గుర్తు చేశారు.

పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులు: ప్రజలకు సేవ చేసిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇచ్చిన వారిని చూశాను కానీ తనను, లోకేశ్​ను, పవన్ కల్యాణ్‌ను తిట్టిన వారికే సీట్లు ఇస్తామని జగన్‌ చెప్పడం తన రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అన్నారని జగన్ మాయలో పడ్డారని, పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు కురిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎక్కడ చూసినా పన్నుల భారం:కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంద్న చంద్రబాబు, తాము ఐటీ ఆయుధం ఇస్తే జగన్‌ రూ.5 వేల ఉద్యోగం ఇచ్చారని ఎద్దేవా చేశారు. సమర్థమైన పాలన ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచే అవసరం లేదని, ఎక్కడ చూసినా పన్నుల భారం పెరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయి: చంద్రబాబు

అనుభవంతో అభివృద్ధిని పరుగులు తీయిస్తా: జగన్‌కు ఓడిపోతామని పిరికితనం వచ్చిందని, అందుకే ప్రజా ప్రతినిధులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా బదిలీలు ఉంటాయని తనకు ఇంతవరకూ తెలీదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయని 2029 నాటికి ఏపీ నెంబర్‌వన్ కావాలని ప్రణాళిక రచించామన్న చంద్రాబాబు, అధికారం చేపట్టగానే తన అనుభవంతో అభివృద్ధిని పరుగులు తీయిస్తానని అన్నారు.

10 ఇచ్చి వంద రూపాయలు లాగేస్తున్నారు: తమకున్న అనుభవంతో రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న చంద్రబాబు, టీడీపీ పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే ఉన్నాయని, ప్రజలకు రూ.10 ఇచ్చి వంద రూపాయలు లాగేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచుల ప్రోటోకాల్​ను కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది: చంద్రబాబు

వందరోజులు కష్టపడితే బంగారుబాట వేస్తా: యువత రోడ్డెక్కి వందరోజులు కష్టపడితే వారి జీవితానికి బంగారుబాట వేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇంట్లో కూర్చుని పనిచేసుకునే అవకాశం కల్పిస్తామన్న చంద్రబాబు, నాలెడ్జ్ ఎకానమీలో మనమే నెంబర్‌వన్‌ అని తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీకి బీసీలు వెన్నెముక అని పేర్కొన్న చంద్రబాబు, వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

రా కదలి రా: చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించామని, కొత్త ఏడాదిలో అందరి జీవితాల్లో వెలుగులు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలని అన్నారు. పాతికేళ్ల క్రితం తన ఆలోచన వల్ల తెలుగు యువత బాగుపడ్డారని తెలిపారు. తెలుగుజాతి స్వర్ణయుగం కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, బీసీల భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా అంటూ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు సమక్షంలో చేరికలు - వైఎస్సార్సీపీపై నేతల సంచలన ఆరోపణలు

చిన్న పొరపాటుకు ఐదేళ్ల నరకం- స్వర్ణయుగం కోసం కదలి రావాలి

ABOUT THE AUTHOR

...view details