మూడు రాజధానులు కావాలని ఎవరడిగారని తెదేపా అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో తెదేపా ప్రజా చైతన్య యాత్రకు హాజరైన చంద్రబాబు.. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోవట్లేదని ఆగ్రహించారు. ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది.. ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఒక్కసారి ఛాన్స్ కోసం ఓటు వేశారు... ఇప్పుడు అనుభవిస్తున్నామంటూ ఆవేదన చెందారు.
3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: చంద్రబాబు - ప్రకాశం జిల్లా మార్టూరులో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర
ప్రకాశం జిల్లా మార్టూరులో తెదేపా ప్రజా చైతన్య యాత్రకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు. 3 రాజధానులు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు.. ప్రజలంతా బాధ పడాల్సి వస్తోందన్నారు.
"మమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు. శనగలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు... కొనే నాథుడు కరవైనా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు పట్టట్లేదు. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టాలని అన్న క్యాంటీన్లు పెడితే వాటిని తీసేశారు. నేనూ ఇలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా? రేషన్, పింఛన్ అన్నింటిలో కోతలు వేసుకుంటూ వెళ్తున్నారు. నిరుద్యోగ భృతి లేదు... ఉపకార వేతనాలు కూడా సరిగా అందట్లేదు. రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు ఎందుకు వెళ్తున్నారో జగన్ సమాధానం చెప్పాలి. అమరావతి, పోలవరాన్ని పట్టించుకోవట్లేదు. అమరావతిపై ఎందుకంత కోపమని ప్రశ్నిస్తున్నా?" అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేస్తుంటే సీఎం పట్టించుకున్నారా? అని నిలదీశారు. ఒకే సామాజికవర్గమంటూ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ఏదైనా ఒక ఊరిలో ఒకే సామాజికవర్గం ఉంటుందా? అని అడిగారు. ఇసుక దొరకని పరిస్థితికి తీసుకొచ్చారని.. ఇసుక, సిమెంటు ధరలు అన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. జే ట్యాక్స్ కడితే మద్యం వస్తుంది... లేకపోతే రాదని ఆరోపించారు. అమ్మఒడి పథకం ఇద్దరు పిల్లలకు ఇస్తామని... ఇప్పుడేమో ఒకరికేనంటూ నిబంధనలు విధించడం ఏంటన్నారు.