గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో పనుల గుర్తింపునకు ముందస్తుగా సోమవారం నుంచి గ్రామసభలను జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నారు. అరకొరగా కురిసే వాన నీటిని భూగర్భంలో దాచుకునేలా.. నీటి సంరక్షణ పనులకు ఈ సారి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి ఈ తరహా పనులతో పాటు, పండ్లతోటల సాగు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
డిసెంబర్ నెలాఖరుకు మంజూరు!
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టాల్సిన పనుల జాబితా తయారీలో డ్వామా అధికారులు నిమగ్నమయ్యారు. కూలీల డిమాండ్‌కు అనుగుణంగా గ్రామానికి అయిదు వేల పని దినాల చొప్పున ఉండేలా పనులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. తక్కువ జనాభా కలిగిన పంచాయతీల్లో పని దినాల సంఖ్య తగ్గనుంది. కొత్త పనులు గుర్తింపు నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ఈ నెల రెండో తేదీ నుంచి నెలాఖరు వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించన్నారు. నవంబర్ నెలాఖరులోపు గుర్తించిన పనుల వివరాలను మండలాల నుంచి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు అందజేయనున్నారు. అనంతరం డిసెంబర్ నెలాఖరుకల్లా పనుల మంజూరు తీసుకోనున్నారు. ప్రస్తుత ఏడాదికి అదనంగా రాబోయే ఏడాదికి కూడా మూడు కోట్ల మేర పని దినాలు ఉండేలా గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.