ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సూరే పల్లిలో నిన్న సగిలేరు వాగుకు వరద పోటెత్తింది. ఒడ్డు వైపు కాకుండా.. అవతలి వైపున చిక్కుకున్న కాపరులు.. ప్రాణ భయంతో క్షణమొక గండంగా బతికారు. చివరికి ఆ పశువుల కాపరులందరినీ అధికారులు ఒడ్డుకు చేర్చారు. ఈ రోజు ఉదయం గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా కలిసి తాళ్ల సహాయంతో 12 మందిని కాపాడారు.
నిన్న సూరెపల్లె గ్రామానికి చెందిన 12 మంది పశువుల కాపర్లు సుమారు 30 గేదెలను మేపుకొనేందుకు సగిలేరు అవతల ఒడ్డున ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా సగిలేరులో వరద నీటి ప్రవాహం పెరిగింది. తిరిగి ఇళ్లకు చేరుకోలేక అవతలి ఒడ్డునే ఉండిపోయారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు వరద నీటి ఉద్ధృతి తగ్గలేదు. దీంతో ఆహారం లేక.. సగిలేరు దాటలేక పశువుల కాపర్లు ఆకలితో ఒడ్డునే ఉండిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆదివారం రాత్రి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సగిలేరు అవతలి వైపు ఉన్న పశువుల కాపర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రవాహ ఉద్ధృతి తగ్గే వరకు సమీపంలోని తుమ్మలపల్లె పాఠశాలలో బస చేయాలని సూచించారు. చివరికి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.