ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిధిలావస్థకు చప్టా.. ప్రజలకు అవస్థలు

VANTHENALU DAMEGE: రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా... విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా.... ఎప్పుడో నిర్మించిన ఆ చిన్న చప్టా మీది నుంచే వెళ్లాలి. ప్రస్తుతం అదీ శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు పడినప్పుడల్లా వరద నీరు నిలవడంతో కాలవ దాటి వెళ్లలేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదీ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని బకింగ్‌ హోమ్‌ కెనాల్‌ పరిస్థితి.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 19, 2023, 5:07 PM IST

శిథిలావస్థకు చేరుకున్న బకింగ్‌హామ్‌ కాలువపై ఉన్న చప్టా

VANTHENALU DAMEGE: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాగులప్పలపాడు, చిన గంజాం మండలాలను కలుపుతూ ఉన్న రహదారి మధ్యలో బకింగ్‌ హోమ్‌ కెనాల్‌ ఉంది. కనపర్తి పంచాయితీ పరిధిలో కుక్కలవాని పాలెంతో పాటు పెద గంజాం, చిన్నపులపాలెం తదితర గ్రామాల ప్రజలు నిత్యం కనపర్తి, నాగలప్పలపాడు, ఒంగోలుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ కెనాల్​కు ఇరువైపులా ఉన్న రహదారులన్నీ తారు, సిమ్మెంట్‌ రహదారులే గతంలో ప్రధాన మంత్రి సడక్‌ యోజనలో నిర్మించారు. సముద్రపు ఆటుపోట్లు వచ్చే చిన్న వాగు మీద ఎత్తయిన వంతెన నిర్మించారు. అయితే మధ్యలో ఉన్న బకింగ్‌ హోమ్‌ కెనాల్‌ మీద మాత్రం వంతెన నిర్మించడం మరిచిపోయారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను , రొయ్యల రైతులు మేతకోసం, సరుకు ఎగుమతుల కోసం ట్రాక్టర్లు, లారీలు తిరగాల్సిన పరిస్థితి.. అయితే బకింగ్‌ హోమ్‌ కెనాల్‌ మీద వంతెన నిర్మించకపోవడం వల్ల రెండువైపులా భారీ వాహనాలు తిరడం లేదు. సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది.

గతంలో రొయ్యల రైతులు తమ వాహనాల కోసం బకింగ్‌ హోమ్‌ కెనాల్‌ మీద సిమెంట్‌ గొట్టాలతో, చప్టా నిర్మించారు. తాత్కాలిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న చప్టా శిధిలావస్థకు చేరుకుంది. గొట్టాలు పగిలిపోయాయి. చప్టా మీదు కూడా మట్టి పోసారే తప్పా, దృఢంగా ఏర్పాట్లు చేయలేదు. వర్షాలు కురిసినప్పుడు చప్టా మీద నుంచి వరద నీరు ప్రవహించి, మట్టి కొట్టుకుపోతోంది. రహదారులు భవనాలు శాఖాధికారులు, స్థానికులు మళ్లీ కంకర మట్టి పోసి కనీసం నడవడానికైనా అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రధాన మంత్రి సడక్‌ యోజన్​లో బకింగ్‌ హోమ్‌ కెనాల్‌ మీద శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్థులు అప్పట్లో డిమాండ్‌ చేసారు. అయితే ఈ కెనాల్‌ నీటిపారుదల శాఖ పరిధిలో ఉండటం.. వారి నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ప్రజల అభ్యర్థన నెరవేరలేదు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే, వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని, బకింగ్‌ హోమ్‌ కెనాల్​కు రెండో వైపు వున్న వారంతా జలదిగ్భంధంలో ఉండాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి బకింగ్‌ హోమ్‌ కెనాల్‌పై వంతెన నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

"బ్రిడ్జి అనేది చుట్టూ పక్కల మొత్తం రోడ్లు ఉంటాయి గానీ ఈ బ్రిడ్జి వరకే లేదు. రేపు వానలు పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లు పైకి పారుతాయి. " - రామచంద్రా రెడ్డి, స్థానికుడు

"వరదలు వచ్చినపుడు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. లారీలు, ట్రాక్టర్లు అటు వెళ్లినపుడు పడిపోతే బయటకు తీసిన సందర్భాలు ఉన్నాయి. గొర్లు వరదల్లో కొట్టుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. చిన్న వర్షం పడ్డా పైగుండా నీళ్లు వస్తాయి. "- కాళేశ్వరరావు, స్థానికుడు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details