ప్రకాశం జిల్లా అంటేనే విపరీతమైన కరవు కాటకాలకు నిలయం. చివరికి మెట్ట పంట సాగు కూడా అంతంత మాత్రంగానే వుంటుంది. రైతులు వర్షాధార పంటలు సాగుచేస్తుంటారు. ఈ ఏడాది మొదట్లో విస్తారమైన వర్షాల పడటం వల్ల రైతులు ఆశలతో పంటల సాగు ప్రారంభించారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అధిక శాతం రైతులు మినుము సాగుచేశారు.
అయితే పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తెగుళ్లు, అధిక వర్షాలు, మారిన వాతావరణం రైతుల పాలిట శాపాలుగా మారి రైతులను కష్టాల కడలిలోకి నేట్టేశాయి. ముందుగా వేసిన పంటకు పల్లాకు తెగులు సోకగా, చివరగా వేసిన లేత పంటకు లద్దె పురుగు, పచ్చ పురుగు, చుట్ట పురుగు సోకింది. దీంతో పంట దిగుబడి మందగించింది.