తూర్పు గోదావరి జిల్లాలో..
అంతర్వేది నరసింహస్వామి దేవాలయంలో రథాన్ని దగ్ధం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాలపై దాడులు నివారించాలంటూ భాజపా కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు.
ప్రకాశం జిల్లాలో...
ఒంగోలులో భాజపా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. భాజపా లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివివాసులు, నాగేందర్ యాదవ్, జనసేన నాయకులతో కలిసి దీక్ష చేశారు.
విశాఖలో..
విశాఖ జిల్లా నర్సీపట్నంలో జన సైనికులు... పార్టీ కార్యాలయం వద్ద గంటపాటు మౌన నిరసన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్వేది ఘటన తేలిగ్గా తీసుకోకుండా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ భాజపా కార్యాలయంలో భాజపా-జనసేన నాయకుల నిరసన చేపట్టారు. అంతర్వేది ఘటన, నాయకుల గృహ నిర్బంధాన్ని వ్యతిరేకించారు.
విజయవాడలో..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. హిందూ మత స్వామీజీలపై అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. హిందూ ధార్మిక క్షేత్రాలలో జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
అంతేర్వేది ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ భాజపా, విశ్వ హిందు పరిషత్ సంయుక్తంగా విజయవాడలో నిరసన దీక్షలు చేపట్టాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందు దేవాలయాలపై దాడులు పెరిగాయని, ఏ ఒక్క ఘటనలోనూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు భాజపా నేత వామరాజు సత్యమూర్తి.
గుంటూరు జిల్లాలో..
ప్రభుత్వ అండతోనే హిందూ దేవాలయాలు, ఆస్తులపై వరుస దాడులు జరుగుతున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై అసలైన నిందితులను ప్రభుత్వం ఇంతవరకూ పట్టుకోలేదు కానీ... అధికారులపై చర్యలు తీసుకున్నామంటూ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. మతిస్థిమితం లేదనివారు చేసిన పనంటూ తప్పించుకోవడానికి లేదని ... పథకం ప్రకారమే జరిగిన దాడి అని కన్నా అభిప్రాయపడ్డారు.
అంతర్వేది ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనకు నిరసనగా దీక్ష చేపట్టారు. జనసేన, భాజపా నేతలను నిర్భంధించడంలో చూపిస్తున్న శ్రద్ధ... అసలైన నిందితులను పట్టుకోవడంలో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.