ప్రకాశం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు పలు చోట్లు ఆందోళన చేపట్టారు.
ఎర్రగొండపాలెం
ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ప్రధాన బ్యాంకులలో సేవలు నిలిచిపోయాయి. కొంతకాలంగా ప్రభుత్వ విధానాలు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన బాటపడుతున్నారు. ఈసారి దశలవారీ ఆందోళనలకు సిద్ధమయ్యారు. నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్ర, శని వారాలతో పాటు ఆదివారం సాధారణ సెలవు కావటంతో మూడు రోజులు సేవలు నిలిచి పోనున్నాయి.
చీరాల
ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐబీయూతో జరిగిన ఒప్పందం ప్రకారం 15 శాతం వేతనాల పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి నెల 11, 12, 13 తేదీల్లో మరోసారి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు తెలిపారు.
గిద్దలూరు
గిద్దలూరు పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతన సవరణ చేయాలని... ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.