Balineni Srinivasa Reddy Meet CM Jagan :3 రోజులు వేచి చూసినా సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దక్కలేదన్న అసహనంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేనితో మాట్లాడి జగన్ ఒంగోలులోనే పోటీ చేయాలా? లేదా గిద్దలూరుకు వెళ్లాలా అనేది రెండు రోజుల్లో తేలుద్దాం అని చెప్పినట్లు తెలిసింది. బాలినేని లోపలికి వెళ్లగానే "ఏం వాసన్నా ఒంగోలులోనే ఉంటావా? గిద్దలూరుకు వెళతావా" అని సీఎం అడిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) విషయం అని బాలినేని చెప్పబోగా సీఎం కల్పించుకుంటూ "మాగుంట సంగతి ఎందుకు? ఆయన గురించే మాట్లాడేందుకు వచ్చావా? ఆయన గురించే అయితే మాటలేమీ వద్దు, మాగుంట ప్రస్తావనెందుకు? నీ సంగతి చెప్పు" అని అన్నట్లు సమాచారం.
రెండు రోజుల్లో తెేలనున్న ప్రకాశం పంచాయితీ :బాలినేని స్పందిస్తూ ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమికి 170 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ డబ్బు ఇచ్చాకనే ఒంగోలులో పోటీ చేస్తానని తాను ప్రకటించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ పరిహారం డబ్బు ఇంతకుముందు ఇస్తామని సీఎం జగన్ కూడా హామీ ఇచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ''ఆ డబ్బు ఇస్తే ఒంగోలులో చేస్తావ్, లేదంటే గిద్దలూరుకు వెళతావు కదా. ఆ డబ్బుల సంగతి చూద్దాం నాకు రెండు రోజుల సమయం ఇస్తే ఏ సంగతీ చెబుతానని'' జగన్ చెప్పినట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీ నాలుగో జాబితాపై జగన్ కసరత్తు - నేతల్లో ఆందోళన
CM Jagan Focus on YSRCP Fourth List Candidates :మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండెపి సమన్వయకర్తగా నియమించడాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలోనూ ఆయన చేసిన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని అంతకంటే ప్రధానంగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డినే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై పార్టీ పెద్దలు స్పందించడం లేదని అసంతృప్తితో ఉన్నారు. సీఎంతో బాలినేని భేటీ సందర్భంగా మాగుంటపై జగన్ అసహనం వ్యక్తం చేశారంటే ఇక ఆయనకు సీటు లేనట్లేనన్న చర్చ ఇప్పుడు వైఎస్సార్సీపీ వర్గాల్లో కొనసాగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంతో భేటీ తర్వాత ప్రకాశం జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డితో పాటు ఆయన ఇంటికి వెళ్లి అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగించారు. రెండు మూడు రోజుల్లో ఈ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.