పల్లె పోరులో ఒక్కో పంచాయతీది ఒక్కో పాట.. ఎక్కడా వినపడదు రాజీ బాట. ఇక ఏకగ్రీవమన్నదే కలలో మాట. దీనికి భిన్నం ప్రకాశం జిల్లాలోని వివిధ గ్రామాలు. ఏకగ్రీవ మంత్రం జపిస్తూ ప్రగతి మార్గంలో పయనిస్తున్నాయి. ఎన్నిక వద్దంటూ.. ఊరికొక్కడికే పట్టం కడుతూ.. శాంతి గీతం ఆలపిస్తూ.. వేళ్లపై లెక్క పెట్టే స్థాయిలోనే ఉన్నా ఆదర్శంగా నిలుస్తున్నాయి.
కొంగళవీడు.. అంకాలమ్మ ఆలయం చూడు..
గిద్దలూరు మండలం కొంగళవీడులో 2013 ఎన్నికల్లో సర్పంచి పదవికి గ్రామస్థులందరూ కలసి వేలం పాట చేపట్టారు. దాంతో నాగిరెడ్డి సుగుణమ్మ ముందుకొచ్చి రూ.15.50 లక్షలు అందజేసి ప్రథమ పౌరురాలయ్యారు. ఆ నిధులతో స్థానిక అంకాలమ్మ దేవస్థానం అభివృద్ధికి గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. వాటిని అందుకోసం వెచ్చించి రమణీయంగా తీర్చిదిద్దారు.
కొత్తకోట.. పీర్ల చావిడికి కళ..
గిద్దలూరు మండలం కొత్తకోటలో గత ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థులుగా పలువురు పోటీ పడి నామినేషన్లు వేశారు. వారితో గ్రామ పెద్దలు చర్చలు జరిపి ఏకగ్రీవానికి ఒప్పించారు. రమాదేవి సర్పంచిగా ఉండేందుకు ఆసక్తి చూపడంతో ప్రథమ పౌరురాలయ్యారు. అందుకు ఆమె ఇచ్చిన నిధులతో శిథిలమైన పీర్ల చావిడిని తొలగించి రూ.7 లక్షలతో కొత్తగా నిర్మించారు. అలాగే తాళ్లపల్లెలో పీర్ల చావిడి వద్ద రూ.1.50 లక్షలతో డీప్‌బోరు వేయించారు.
మళ్లపాలెం...వెలసెను ప్రార్థనా మందిరం..
పుల్లలచెరువు మండలం మళ్లపాలెం పంచాయతీని గత ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఇద్దరు నాయకులు సర్పంచి పదవికి పోటీ పడగా గ్రామస్థులు వేలం పాట నిర్వహించారు. దాంతో మాగులూరి ఆశీర్వాదం రూ.12 లక్షలు అందించేందుకు ముందుకు రావడంతో ఏకగ్రీవమైంది. ఆ నిధులతో కొత్త ప్రార్థనా మందిరం నిర్మించి వసతులు కల్పించారు.
సర్పంచి గిరి @ రూ.26.90 లక్షలు..
దర్శి మండలంలోని జముకులదిన్నె సర్పంచి పదవిని అదే గ్రామానికి చెందిన మర్రి సత్యనారాయణ దక్కించుకున్నారు. మంగళవారం గ్రామంలో సమావేశమైన పెద్దలు అర్ధరాత్రి వరకు మంతనాలు సాగించి చివరకు వేలం నిర్వహించారు. తెదేపా సానుభూతిపరుడు మాగం సుబ్బారావు రూ.20 లక్షలకు పాడగా మర్రి సత్యనారాయణ రూ.26.90 లక్షల పాటతో పదవిని చేజిక్కించుకున్నారు. ఈ నిధులతోపాటు ఏకగ్రీవమైతే ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ప్రోత్సాహకాన్నీ రెండు ఆలయాల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను కలిసి వైకాపా తీర్థం తీసుకున్నట్లు సమాచారం. మండలంలో గతంలో ఇంత భారీ మొత్తం చెల్లించి పదవి దక్కించుకున్న దాఖలాలు లేకపోవడం చర్చనీయాంశమైంది.