కరోనా వైరస్ విజృంభించిన వేళ దాదాపు ప్రతి ఇంట్లో మందుల వాడకం పెరిగింది. విటమిన్, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడేవారు అధికమయ్యారు. దానికితోడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా మందుల ఖర్చు ఉండనే ఉంది. అసలే ఆదాయానికి గండిపడిన వేళ ఈ ఖర్చు అందరికీ భారమయ్యేదే. ఇలాంటి సమయంలో చాలామంది జనరిక్ మందులవైపు అడుగులు వేశారు. ఎప్పట్నుంటో ఇవి ఉన్నా.. కరోనా కారణంగా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా జనరిక్ మందుల వినియోగం పెరిగింది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే ధర తక్కువగా ఉండడం, వాటిలానే పనిచేస్తుండటంతో చాలామంది జనరిక్ వైపు చూస్తున్నారు.
బ్రాండెడ్ -జనరిక్ మధ్య తేడా
ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మార్కెట్లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీపై ఆ కంపెనీకి కొంతకాలం పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ మందును ఆ ఫార్ములాలో వేరే ఏ సంస్థ కూడా ఔషధం తయారు చేయకూడదు. అలా తయారుచేసి అమ్మితే వారు శిక్షార్హులవుతారు. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు. వాటి తయారీకి అయిన ఖర్చు తక్కువే అయినప్పటికీ ఫార్మా కంపెనీలు వాటిని చాలా అధిక ధరలకు అమ్ముతారు.
ఆ మందు మొట్టమొదట తయారు చేసిన కంపెనీ పేటెంట్ కాలం ముగిసిన తర్వాత.. అవే కెమికల్స్ ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ సంస్థైా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. అలా తయారు చేసిన మందులను " జనరిక్_డ్రగ్స్" అంటారు. జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుంచి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని అమ్ముతారు.
కరోనాతో పెరిగిన వినియోగం