ప్రకాశం జిల్లా టంగుటూరు, సింగరాయ కొండ మండలాల సరిహద్దులో సముద్రంలో మూసి, పాలేరు కాలువలు కలుస్తాయి. సముద్రానికి ఆటుపోట్లు వల్ల కాలానుగుణంగా ఈ రెండు కాలువుల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది. అదే విధంగా కాలువల్లో వచ్చే నీరు కూడా.. పోటుతో పాటు సముద్రంలోకి తీసుకువెళుతుంది. ఇది ప్రకృతి పరంగా జరిగే సహజ ప్రక్రియ.. పోటు సమయంలో ఈ రెండు కాలువుల్లో సుమారు 7 కి.మీ. వరకూ ఉప్పునీరు చేరుతుంది. ఈ నీటిని రైతులు ఆక్వా సాగుకు వినియోగిస్తారు.
కాలువలు సముద్రంలో కలిసేచోట ఇసుకమేటలు..
ఆక్వా చెరువుల ఖాళీ అయినప్పుడు వ్యర్థ జలాలు సైతం ఈ కాలువల ద్వారా సముద్రంలోకి చేరిపోయేవి. ప్రస్తుతం పాకాల సమీపంలో ఈ రెండు కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతంలో భారీగా ఇసుకమేటలు ఏర్పడ్డాయి. వీటివల్ల సముద్రం ఆటుపోట్ల సమయంలో కాలువల్లోకి ఉప్పునీరు రావడంలేదు. కాలువుల్లో ఉండే నీరు సముద్రంలో కలవడం లేదు. ఏళ్ళ తరబడి కాలువల్లో నీరు నిల్వలు పేరుకుపోయి కలుషితం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆక్వా రైతులు సొంతంగా ఒకటి రెండు సార్లు ఈ మేటల్ని తొలగించినా.. నెల రోజుల వ్యవధిలోనే పూడికుపోతుందని రైతులు వాపోతున్నారు.