అనాథలకు ఆనందంగా ఆహారాన్ని పంచుతున్నాడు మాధవ్. ప్రకాశం జిల్లా లింగంపాలెం వాసి మాధవ్... రిమ్స్‌లో సైకాలజీ కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తించేవాడు. ఒంగోలులో నివాసముంటూ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన... ఆసుపత్రి ఆవరణలో, రహదారుల వెంట, కార్ల షెడ్ల కింద ఆకలితో అలమటించే... వారిని గమనించారు. అనారోగ్యం బారినపడిన కొందరు... అన్నం లేక ఆకలితో అలమటించే వారిని మాధవ్ గుర్తించారు. విధులకు వచ్చే సమయంలో భార్య పెట్టే అన్నంలో సగాన్ని ఒక్కో మనిషికి పెట్టడం ఆరంభించారు. అలా సేవ ప్రారంభించిన మాధవ్... తర్వాత కాలంలో ఉద్యోగం వదిలి... పేదల సేవలో తరిస్తున్నారు.
మాధవ్ సేవను గుర్తించిన ఆయన భార్య మజ్నూ... ఈ కార్యక్రమంలో భాగమైంది. ఆమె గర్భిణీగా ఉన్న సమయంలో ఇద్దరూ వంట చేసి... ఆ ఆహారాన్ని ఆటోల్లో పేదలున్న ప్రాంతానికి తీసుకెళ్లి ఇచ్చేవారు. ఆకలిలో ఉన్న వృద్ధులు... మాధవ్ ఎప్పుడు అన్నం తెస్తాడా... అని ఎదురుచూడటం ప్రారంభించారు. అలా... కొందరితో ప్రారంభమైన మాధవ్ దంపతుల సేవ... రోజురోజుకూ పెరిగింది.