విశాఖపట్నం జిల్లాలో..
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో.. నర్సీపట్నం సబ్ డివిజన్లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. దీనికోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి బాలకార్మికులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, కోటవురట్ల తదితర మండలాల్లో వీధి బాలలు, అనాధలు, తప్పిపోయిన, పారిపోయి వచ్చిన పిల్లలను గుర్తించారు. ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన 78 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 13 మంది అనాధ బాలలను శిశుగృహాలకు తరలించారు. తాము గుర్తించిన పిల్లల్లో 58 మంది బాలురు, 28 మంది బాలికలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈనెల 29న సైతం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అనకాపల్లి పట్టణంలో 23 మంది చిన్నారులను గుర్తించి.. వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర్రావు తెలిపారు. పిల్లలతో భిక్షాటన చేస్తున్న మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు
గుంటూరు జిల్లాలో..
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా.. నరసరావుపేటలో వీధి బాలబాలికల సంరక్షణ కార్యక్రమాన్ని స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ జే.త్రివిక్రమ్ వర్మ పాల్గొన్నారు. కరోనాతో ప్రస్తుతం విద్యాసంస్థలు లేక విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. స్థానిక డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో 49 మంది బాలకార్మికులను గుర్తించి.. వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నామన్నారు.
అనంతపురం జిల్లాలో..
విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని డీఐజీ కాంతి రాణా టాటా అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా... జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న బాలబాలికలను చైల్డ్ లైన్, ఐసీడీఎస్ సహకారంతో విముక్తి కలిగించారు. జిల్లాలో ఇప్పటివరకు 416 మందిని గుర్తించామని, వీరిలో 364 మంది బాలలు, 54 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ సత్య బాబు చెప్పారు. పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో..
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా.. పోలీసులు, బాలలపరిరక్షణ సమితి, కార్మిక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, యాచకవృత్తి చేస్తున్నవారు, అనాథ బాలలు, వీధిబాలలు, తల్లిదండ్రులు నిర్లక్ష్యానికి గురయిన 739 మంది బాలబాలికలను గుర్తించి వెట్టిచాకిరి నుంచి వారికి విముక్తి కల్పించారు. చదువుకోవలసిన పిల్లల చేత పనులు చేయించడం నేరమని, వారి బంగారు భవిష్యత్తును మగ్గబెట్టడం బాధాకరమని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో పనులు చేయించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో..
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కొనసాగుతోంది. పోలీసులు 117 బృందాలుగా ఏర్పడి 300 మంది వీధిబాలలను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలను కౌన్సెలింగ్ ఇస్తామన్నారు.