వైభవంగా దసరా శరన్నవరాత్రులు - అమ్మవారు
రాష్ట్రవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి సంబరాలు మిన్నంటుతున్నాయి. వేర్వేరు అవతారాల్లో అమ్మవారు భక్తులకు అభయమిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.

కర్నూల్లో దసరా శరన్నవరాత్రుల సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో మహిళల సంప్రదాయ నృత్యాల ఆకట్టుకున్నాయి. ఎమ్మిగనూరులో శ్రీకన్యకాపారమేశ్వరీదేవి ఆలయంలో... అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీవాణిగా దర్శనమిచ్చన అమ్మవారిని చూసి తరించేందుకు భక్తులు పోటెత్తారు.
ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో... అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 400 మంది చిన్నారులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. గిద్దలూరులో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యర్రగొండపాలెంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగానూ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా గాలాయగూడెంలో... కనకదుర్గమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశాఖ మన్యంలోనూ దుర్గాదేవి శరన్నవరాత్రుల సంబరాలు అంబరాన్నంటాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రాన జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. విశాఖలోని సత్యసాయి విద్యావిహార్‌లో అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో... శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో.... చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.