Tanguturi Prakasam Pantulu Jayanti టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, నవీనాంధ్ర పితగా పేరుపొందారు. తల్లి ధైర్యమే ప్రకాశం జీవితానికి తొలి బీజం. పేదరికం పుటం పెడితే, కళాకారుడిగా జీవితం- సమాజం పట్ల అవగాహన పెంచింది. గురువు మార్గదర్శనం ముందుకు నడపగా, మొండితనం విజయమై నడిచివచ్చింది. స్నేహితుల సహకారం అండగా నిలిస్తే, ముక్కుసూటితనం ఆదర్శనీయ శక్తిగా నిలబెట్టింది. ఉజ్జ్వల దేశభక్తి, నిరుపమాన త్యాగగుణం, అలుపెరగని కార్యదీక్ష... మహోన్నతుడిగా మలచాయి. గాంధీ మహాత్ముడు వంటి వ్యక్తులు ఆయన స్వభావాన్ని ప్రశంసించారు. కనికరం ఎరుగని బ్రిటిష్ తుపాకికి గుండెలు చూపిన ధైర్యశాలి ప్రకాశం- ‘ఆంధ్రకేసరి’గా కీర్తి గడించారు. ఆదర్శ నాయకుడై స్ఫూర్తినందించారు.
బాల్యం నుంచే ఎదురీత:నూటయాభై ఏళ్ల క్రితం ఆగస్టు 23న పేదరికంలో పుట్టిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. భర్త దూరమైనా, మొక్కవోని ధైర్యంతో పూటకూళ్ల వృత్తిని చేపట్టిన ప్రకాశం తల్లి కుమారుణ్ని తీర్చిదిద్దారు. అప్పుడే ఒంగోలు మిషన్ హైస్కూలులో పనిచేసే ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ప్రకాశంలో నటుణ్ని గుర్తించి, స్త్రీ పాత్రలకు బాగుంటారని భావించారు. రుసుము లేకుండా మిషన్ హైస్కూల్లో చేర్పించి, వాత్సల్యం చూపారు. వకీలు అవ్వాలన్న ఆకాంక్ష చిన్నతనం నుంచే నరనరాల్లో నింపుకొని మద్రాసు న్యాయ కళాశాలలో చదివి రెండో శ్రేణి ప్లీడరుగా నమోదయ్యారు. గురువును వదలి ఉండలేక రాజమండ్రిలోనే వృత్తిని చేపట్టారు. గురువుతో పాటు చిలకమర్తి లక్ష్మీనరసింహంతో కలిసి ఓ నాటక సమాజాన్ని స్థాపించి అనేక పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించేవారు. మొదటి నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన ప్రకాశం 27ఏళ్ల వయసులో మున్సిపల్ కౌన్సిలర్‌గా, తరవాత చైర్మన్‌గా ఎన్నికయ్యారు. స్నేహితుల సహకారంతో 1904లో ఇంగ్లాండ్ వెళ్ళి, బారిస్టర్ పూర్తి చేసి, మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, న్యాయం వైపు నిలబడే లక్షణాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టాయి. బారిష్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా, మద్రాసు లా టైమ్స్ పత్రిక సంపాదకులుగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పేదల పక్షపాతిగా పేరుతో పాటు డబ్బునూ గడించారు.
వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో ప్రకాశం ధైర్యంగా అనేక సభలకు అధ్యక్షత వహించారు. 1921లో నాగ్‌పుర్ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఎందరో మహనీయులు తమ వృత్తులను మానేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశం కూడా అదే బాటలో నడిచారు. దేశం కోసం వృత్తిని విడిచి, ఆర్జనను ప్రజలకు పంచిపెట్టిన ప్రకాశం స్ఫూర్తి ఈతరం యువతకు ఆదర్శనీయం. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. నిర్భయంగా వార్తలను అందిస్తూ బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన ఆ పత్రిక ఆంగ్లం, తెలుగు, తమిళ భాషల్లో వెలువడేది. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని నాటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకాశం ముందుండి నడిపించారు. ఆ సమయంలో ప్రభుత్వం కాల్పుల ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటికే ఓ యువకుడు వీరమరణం పొందారు. అతడి భౌతిక దేహాన్ని చూడటానికి వెళ్తున్న ప్రకాశాన్ని సిపాయిలు అడ్డుకున్నారు. ముందుకు వెళితే కాల్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధైర్యముంటే తనను కాల్చమంటూ బ్రిటిష్ తుపాకికి గుండెను చూపి నిలబడ్డారు. వెంటనే తుపాకి నేలను చూసింది, జైజై నినాదాలు ఆకాశాన్ని తాకాయి. ఆ తరవాత 1929 లాహోర్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, రాష్ట్ర అధ్యక్ష పదవికి, కేంద్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం గాంధీజీ దండి సత్యాగ్రహానికి చలించిపోయి, కేంద్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, అరెస్టయి జైలుకు వెళ్ళారు. ఆ సమయంలో కుటుంబం ఆర్థికంగా చితికిపోయి, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చినా ఏ మాత్రం చలించలేదు. 1945లో జైలు నుంచి విడుదలై తెలుగు నాట విస్తృతంగా పర్యటించారు.