Kondipi MLA Dola Veeranjaneya Swamy fire on police: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన సవలం సుధాకర్ భార్య సవలం హనుమాయమ్మను తాజాగా అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవలం కొండలరావు ట్రాక్టర్‌తో ఢీకొట్టి అతికిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హనుమాయమ్మ మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెప్పిన మాటలు చాలా శోచనీయమని.. కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపై కొండపి ఎమ్మెల్యే డోలా ఆగ్రహం.. ఈ సందర్భంగా కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి సవలం సుధాకర్ భార్య హనుమాయమ్మ హత్య ఉదంతంపై మాట్లాడుతూ..''టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన సవలం సుధాకర్ భార్య సవలం హనుమాయమ్మ(50) హత్యపై పోలీసులు చెప్తున్న మాటలు చాలా శోచనీయంగా ఉన్నాయి. హనుమాయమ్మ హత్య రాజకీయాలకు సంబంధంలేదని.. ఇది పూర్తిగా కుటుంబ కలహాల వల్లే జరిగిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ల మీద కుటుంబ కలహాలు ఉన్నాయి. దూరపు బంధుత్వాలున్నాయి. కానీ, చంపినటువంటి వ్యక్తి (ముద్దాయి) ఎవరైతే ఉన్నారో.. ఆ వ్యక్తి కొద్ది రోజులక్రితం..'నా పార్టీ నాకు అండగా ఉంది. నేను మీ అంతు తేల్చుతాను' అంటూ చెప్పాడు. ఆ మాటల్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..?, అధికార పార్టీ ఒత్తిడికి పోలీసులు ఎందుకు లొంగారు..?, రాత్రివరకూ ముద్దాయి దొరకలేదన్నారు. నిన్న ముద్దాయి దొరికిన తర్వాత అప్పటికప్పుడు విచారణ ఎప్పుడు పూర్తి చేశారు..?'' అని ఆయన అన్నారు.