అమరావతి రైతులు చేపట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహాపాదయాత్ర (Amaravathi Farmers Maha Padayatra) 15వ రోజు ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో 9వ రోజుకు చేరింది. జరుగుమల్లి మండలం ఎం.నిడమానురు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఇవాళ సుమారు 14 కి.మీ సాగనుంది. కందుకూరు మండలం విక్కిరాలపేటలో ఇవాళ రాత్రి బస చేయనున్నారు.
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 45 రోజులపాటు మహా పాదయాత్ర చేపట్టారు. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా పాదయాత్ర చేపట్టారు.
14వ రోజు టంగుటూరు మండలం యరజర్ల శివారు నుంచి ప్రారంభమైన యాత్ర ఎం.నిడమనూరు వరకు 13 కిలోమీటర్ల మేర సాగింది. ఎక్కడికక్కడ మేళ తాళాలు, నృత్యాలతో రైతులకు పూలబాట పరచి గ్రామాల్లోకి ఆహ్వానించారు. జనం స్పందన తమ అలసటను దూరం చేస్తోందన్న రైతులు.. ఇకపైనా రెట్టించిన ఉత్సాహంతో అడుగులేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన మంత్రులు విచక్షణ మరిచి రైతులపై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిడమనూరు నుంచి ప్రారంభమైన పాదయాత్రకు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం అటంకం కలిగించినా ముందుకు సాగారు. రహదారులు అధ్వాన్నంగా ఉండటంతో వర్షానికి బురదమయమయ్యాయి. ఆ బురదలోనే రైతుల పాదయాత్ర సాగుతోంది. అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది పడుతూనే రైతులు పాదయాత్ర చేస్తున్నారు. నిడమనూరు, ఉప్పలపాడు గ్రామాల్లో రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ స్థానికులు తరలివచ్చి పాదయాత్రకు స్వాగతం పలుకుతున్నారు. కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామితో పాటు స్థానిక వామపక్ష నాయకులు పాదయాత్రకు మద్ధతు తెలిపి రైతుల వెంట నడిచారు. పాదయాత్రకు లభిస్తున్న మద్ధతుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: