కరోనా కాలంలో ఉపాధి లేక అలమటిస్తున్న పేదలకు తనవంతు సహాయం చేయాలనుకున్నారు ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. తనకు నెలనెలా వచ్చే పింఛనులో కొంతమొత్తం ఖర్చుచేసి పేదల ఆకలి తీరుస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బట్ట మోహనరావు.. పుష్పవల్లి ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి గత ఫిబ్రవరి నుంచి.. ప్రతి మంగళ, శనివారాల్లో దేవాంగపురిలో అన్నదానం చేస్తున్నారు.
ఇప్పటివరకు పదిహేను వందల మందికి అన్నదానం చేశారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్ విద్యార్థుల చదువుకు సహాయం చేస్తున్నారు. కరోనాపై అవగాహన పెంచుతూ జాండ్రపేట గ్రామస్థులందరికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రతి శని, మంగళవారాల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మోహనరావు తెలిపారు.