ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పాదర్తి గ్రామానికి చెందిన రామారావు ఇంటికి వెళ్లితే ఎవరి మనసైనా పులకరించిపోతుంది. సామాన్య రైతు నివసించే రేకుల షెడ్డు... నందనవనాన్ని తలపిస్తుంది. ఎన్నో రకాల మొక్కలు అక్కడ కనువిందు చేస్తాయి. ఆ ఇంటిని చూస్తే అర్థమవుతుంది రామారావు ఓ ప్రకృతి ప్రేమికుడని. 10వ తరగతి వరకు చదువుకున్న ఈయన... గతంలో ఓ లారీ డ్రైవర్. వ్యవసాయంపై మక్కువతో కొన్నేళ్ల క్రితం పొలం కొనుగోలు చేశాడు. అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రసాయనాలు లేకుండా....
రామారావు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నాడు. ఓ ఆవును పెంచుకుంటూ దాని పేడతో ఎరువులు, జీవామృతాలు తయారు చేసి తన పంటకు వినియోగిస్తున్నారు. వివిధ రకాల కషాయాలు తయారు చేసి పంటకు వాడుతున్నారు. అంతే కాదు ఆవు పేడతో వచ్చే పిడకలను వంటచెరకుగా వినియోగించటంతో పాటు, కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు కలిపి టూత్ పౌడర్, షాంపోలు వంటివి కూడా తయారు చేస్తారు. వీటిని తోటి రైతులకు విక్రయిస్తున్నారు.