ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బలరాం కృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా చీరాల నుంచి పందిళ్లపల్లి వరకూ శనివారం సాయంత్రం ఆయన వర్గీయులు ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టారు.
పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటి ఎదురుగా ర్యాలీ వెళుతుండగా ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ర్యాలీపై ఆమంచి వర్గీయులు రాళ్లు వేశారని కరణం అనుచరులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చీరాల ఇంఛార్జ్ డీఎస్పీ వేణుగోపాల్, మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.