ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిపై వేటు పడింది. ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన విశ్రాంత తహసీల్దార్ విద్యాసాగారుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. మార్కాపురం మండల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి కారణమైన 12 మంది వీఆర్వోలు, ఓ సర్వేయర్‌ను సస్పెండ్ చెయ్యగా.. కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి శాశ్వతంగా తప్పించారు.
కోట్ల రూపాయల అవినీతి..
మార్కాపురం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన విద్యాసాగారుడు.. ఇటీవల పదవీ విరమణ పొందారు. ఇదే అదునుగా భావించిన కొందరు సిబ్బంది.. సదరు తహసీల్దార్‌తో బేరాలు కుదుర్చుకున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు కట్టబెట్టి రూ. కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారు.