Nara Lokesh Yuvagalam Mahapadayatra : జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తొలి ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. అధికార పార్టీ నేతల అవరోధాలు, అడ్డంకుల్ని దాటుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్.. నేడు సింహపురి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. సీమలో.. దిగ్విజయంగా సాగిన లోకేశ్ యాత్ర.. కార్యకర్తల్లో జోష్ నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45రోజులు పాటు 577 కిలో మీటర్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23రోజుల 303 కిలో మీటర్లు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజులు 507 కిలో మీటర్లు, ఉమ్మడి కడప జిల్లాలో 16రోజులు 200 కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో, అనంతపురంలో 9, కడప జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. మొత్తంగా రాయలసీమలో 44 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 108 మండలాలు, 943 గ్రామాల మీదుగా యువనేత పాదయాత్ర కొనసాగింది.
మిషన్ రాయలసీమ ప్రకటన.. 124రోజుల సుదీర్ఘ పాదయాత్రలో రాయలసీమలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్న నారా లోకేశ్.. వారి కష్టాలు తెలుసుకున్నారు. అందుకు పరిష్కారంగా ఈ నెల 7వ తేదీన కడపలో “మిషన్ రాయలసీమ” పేరిట అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో రాయలసీమకు తాము ఏం చేస్తామనేది వెల్లడించారు. రెండు, మూడు అనివార్య సందర్భాల్లో మినహా ఎండా, వానలను సైతం లెక్కచేయకుండా యువనేత లోకేశ్ సాగిస్తున్న పాదయాత్ర.. పసుపు శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
జగన్ సొంత జిల్లాలో.. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం, ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగట్టడం, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని వైఫల్యాలపై సెల్ఫీ ఛాలెంజ్‌లు విసరడం వంటివి జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. రాయలసీమ ప్రజల కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానన్న యువనేత లోకేశ్‌కు సీమప్రజలు జేజేలు పలికారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో యువగళం పాదయాత్ర 16రోజులపాటుహోరెత్తించింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 కిలో మీటర్ల మేర నిర్వహించిన యువనేత పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలు చెప్పుకొన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప, రాజంపేట, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.