YSRCP REBEL MLA KOTAMREDDY : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఈ నెల 25న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, కాలువలు, కల్వర్టులు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాను ప్రజాపక్షానే నిలబడుతానన్నారు. దెబ్బతిన్న రోడ్లు, పొట్టేపాలెం, ములుముడి కలుజులపై కల్వర్టులు, కొమ్మరపుడి లిఫ్ట్ ఇరిగేషన్, బీసీ భవన్, అంబేడ్కర్ భవన్లను నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందన లేదని మండిపడ్డారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కోటంరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ కారణంగా తన కార్యాలయ ఆవరణంలోనే ఈ నిరసన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో జాతర నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 25లోగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికార పార్టీని విభేదించక ముందే జాతర నిర్వహిస్తానని ప్రకటించినట్లు చెప్పారు.