YSRCP Government Negligence on Welfare Hostels :నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూపదేపదే పలికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. వాస్తవానికి వారిపై కపట ప్రేమ చూపుతున్నారు. పేద పిల్లలుండే వసతి గృహాలను పూర్తిగా గాలికి వదిలేసి వారి జీవితాలను చీకట్లోకి నెట్టారు. మెనూ ఛార్జీలు (Menu Charges) పెంచామంటూనే ఉడకని అన్నం, నీళ్ల చారు, పులిసిన మజ్జిగ, పురుగులుపట్టిన పల్లీపట్టీలు పెడుతున్నారు. టాయిలెట్లు బాగోలేక కనీసం మంచి నీరు కూడా రాక నెల్లూరు జిల్లాలో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.
Government Hostels Situation Under CM Jagan Ruling :ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారికి కార్పొరేట్ స్థాయిలో వసతి కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.నెల్లూరు నగరంలో జిల్లా అధికారులు నిత్యం తిరిగే ప్రాంతంలో కొండాయిపాలెం గేటు వద్ద ఎస్సీ కళాశాల వసతి గృహమే అందుకు నిదర్శనం. పెచ్చులూడిన గోడలు, చెత్తాచెదారం, తలుపుల్లేని గదులు, అపరిశుభ్ర మరుగుదొడ్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు రాని కులాయిలు ఇలా అణువణువునా పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన దుస్థితి. పారిశుద్ధ్యం లోపించి ఈగలు, దోమలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇదే ప్రాంతంలోని మరో వసతి గృహం భవనం కూడా ఇంత దారుణంగా ఉన్నా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
వసతిగృహాలా జైళ్లా? విద్యార్థులకు కనీస సౌకర్యాలు పట్టించుకోని ప్రభుత్వం - చలికి వణుకుతూ నేలపైనే నిద్ర
Welfare Hostels Situation in Nellore :ఆర్వో ప్లాంట్ పాడయై నెలలు గడుస్తున్నా కనీసం దానికి మరమ్మతులు చేయలేదు. తాగు నీరు లేక విద్యార్థులు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. మెనూ ఛార్జీలు పెంచి పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి దారుణంగా ఉందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.