Anam Ramanaraya Reddy on removing gunmen: తనకు కేటాయించిన భద్రత గన్మెన్లను తొలగించడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానంతో పాటు.. ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలైట్ల ప్రభావితం కలిగిన.. కేంద్రం నిర్ధారించిన ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, అలాంటి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో భద్రత ఎలా తొలగిస్తారంటూ ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. తాను 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రత విషయంలో కనీసం తనకు సమాచారం ఇవ్వకుండానే.. ఇద్దరు గన్మెన్లను ఏకపక్షంగా తొలగించారని మండిపడ్డారు. గతంలో నక్సలైట్లు, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రభావం కలిగిన ప్రాంతం వెంకటగిరి అనీ.. గత మూడు నెలల క్రితం కలువాయి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపిన ఓ యువకుడిని స్మగ్లర్లు దారుణంగా హత్య చేసినట్లు ఆనం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా చరిత్రలో ఇలా గన్మెన్లను తొలగించిన పరిస్థితి ఎప్పుడూ లేదని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
నేరుగా.. రాజకీయంగా ఎదుర్కోలేక.. భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆనం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెంకటగిరిలో ఓ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన తన కటౌట్‌ను తగలబెట్టారని తెలిపారు. ఇక తనను అంతమొందించడం ఒక్కటే మిగిలి ఉందని వెల్లడించారు. తనపై అనేక కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఆయన.. తాను ఆరుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా.. తొమ్మిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. తన భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలని ఆయన వెల్లడించారు. తన ఫోన్లు రెండున్నరేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అవుతూ ఉన్నాయని ఆనం సంచలనం కామెంట్స్ చేశారు.